భూమి నుండి చంద్ర మండలం పైకి, ఒక గ్రహం నుండి మరో గ్రహం వైపు మనిషి తన మేధస్సుతో పయనిస్తుంటే... మనుషుల్లో మానవత్వ విలువలు నశించి సమాజం ఒక అడవిగా మారే క్రమం నేటి మన కళ్ళముందు కనిపిస్తున్న సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అమ్మగా, సోదరిగా, ఆలిగా  స్త్రీ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న నేటి భారతదేశంలో తన మనుగడ ఒక ప్రత్యేకమైనది.   స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా స్త్రీ అణచివేయబడుతుందని ఇటీవల జరిగిన సంఘటన ద్వారా వ్యక్తం అవుతుంది. చట్టాలు ఎన్ని వచ్చినా మరి ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నవి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది! పనిచేసే చోట ఐతే నేమి... మరి ఎక్కడైతే నేమి తనపై కొందరి  మగాళ్ళ చూపు మరో కోణంలో ఎందుకు ఉంటుంది.  తనను కనిపెంచింది  ఆ స్త్రీ మూర్తి అయినా కొందరిలో మరో చూపు ఆ స్త్రీపై ఎందుకుంటుంది? సభ్య సమాజం తలదించుకునే విధంగా అనేక అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతున్న నేటి తరుణంలో గడప దాటి బయటకు వెళుతున్న  స్త్రీకి ఇంటి వద్ద తన తల్లి జాగ్రత్త బిడ్డా  అని చెప్పని రోజు ఉన్నదా! ఒక్కసారి ఆలోచించాలి. మగాళ్లు మృగాలుగా మారి కామంతో కళ్ళు మూసుకుపోయి    నీచపుచీకటి క్రీడకు బలి అవుతున్న ఎందరో మంది స్త్రీలు వేదన, ఆవేదన, జరుగుతున్నా అన్యాయాలు అనిర్వచనీయమైనది.   మొన్న కలకత్తాలోని శిక్షణా మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 

                ” స్త్రీ  తన జననం ఒక చోట….. తన మరణం మరో చోట”
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే “ స్త్రీ “ తన బాల్యం నుండి వివాహం వరకు ఒకచోట, వివాహం తర్వాత నుండి మరో చోట తన జీవిత ప్రస్థానం కొనసాగుతున్న కథనం మనకు తెలిసినదే….. ఒక్కసారిగా తను పుట్టిపెరిగిన ప్రాంతం నుండి వివాహం అనే అనుబంధం ద్వారా మరో ప్రాంతంలో తన జీవన గమనం కొనసాగుతుంది. పుట్టింటి నుంచి మెట్టినింట్లో తన కొత్త జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభం చేస్తుంది. ఇంతటి మార్పును ఎదిరిస్తూ కూడా మరో ప్రక్క సమాజంలో కొన్ని దుశ్చర్యలు అయినటువంటి టీజింగ్, గృహ హింస, వరకట్న వేధింపులు, విడాకులు, కుటుంబ బాధ్యతలు అంటూ రకరకాల సమస్యలను నేటికీ ఎదుర్కొంటుంది. నేటికీ స్త్రీ అణచివేయబడతుంది. లెక్కలేనన్ని చట్టాలు ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఇంకా అణచివేయడం ఇలాంటి సంఘటనలు మనం పత్రికలలో సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఒక కోణంలో పరిశోధిస్తే కావలసింది సమసమాజ మార్పు, కఠిన శిక్షలు అమలులోకి రావడం ఎంతైనా అవసరము ఉన్నదని అంతర్గతంగా, బహిర్గతంగా తెలుస్తున్నది. ఆడవాళ్ళ భద్రత విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్షలు అమలు అయ్యేటట్టు అత్యాచారం, హత్యాచారం ఉదంతం జరిగదానికి సంబంధిత నిందితులను శిక్షించే విధంగా సత్వర పరిష్కారం అవసరమని చెప్పవచ్చు. అప్పుడు మరింత మన న్యాయవ్యవస్థపై అందరికీ నమ్మకం ఏర్పడుతుంది. బాధితులకు కొంతవరకు ఉపశమనం జరుగుతుందనవచ్చు . మరియు ఒక ఆడపిల్ల తప్పిపోయినప్పుడు కొన్ని దేశాల్లో మాదిరిగా పోలీసు వ్యవస్థ తో పాటు ఇతర గ్రూపులు సంఘటన జరిగినప్పుడు ముందడుగు వేయాలి. వయసుతో నిమిత్తం లేకుండా పసికందు నుండి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనుషుల్లో మానవత్వం విలువలు లోపించిన తరుణంలో కొత్త మార్పుకై ఈ లోకం ఎదురుచూస్తుంది.

-డా. చిటికెన కిరణ్ కుమార్
కవి, రచయిత, విమర్శకులు
మెంబర్: ఐ. బి. ఆర్. ఎఫ్,
Cel:9490841284

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *